హైదరాబాద్ శివారు ప్రాంతమైన గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని నిషిద్ధ జాబితా లో ఉన్న సుమారు రూ. 1,500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేసేందుకు ఒక ముఠా కుట్ర పన్నింది. ఈ క్రమంలో 1993, 2003 కాలం నాటి నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను, సెక్రటేరియట్ స్థాయి ఫోర్జరీ ముద్రలను సృష్టించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ భారీ దందా వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు బొల్లా రమేష్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లుగా గుర్తించారు. నకిలీ దస్తావేజుల సృష్టి, భూ సెటిల్మెంట్ల వ్యవహారంలో వీరు తెరవెనుక ఉండి చక్రం తిప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు రాజకీయ అండదండలు అందించడంతో పాటు రికార్డుల మార్పిడి కోసం పెద్ద ఎత్తున నిధుల పంపిణీ జరిగిందనే కోణంలో సైబరాబాద్ పోలీసులు వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రంగంలోకి దిగిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్ అనే ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగానే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర స్పష్టమైనట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, పొరుగు రాష్ట్ర అధికార పక్ష మాజీ నేతల లింకులు బయటపడటంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కుంభకోణానికి సహకరించిన రెవెన్యూ అధికారుల పాత్రపైనా నిఘా పెట్టామని, రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
0 Comments