Ad Code

ఐపీఎల్ ఫైనల్ కు వర్ష గండం ?


రేపు ఐపీఎల్ ఫైనల్  జరగనుంది. ఈసారి టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. అయితే అహమ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు వర్షం భయం అభిమానుల్లో కాస్త టెన్షన్ గా మారింది. ఈ సీజన్‌ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆర్‌సీబీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసి నేరుగా ఫైనల్ బెర్త్ కైవసం చేసుకుంది. మరోవైపు క్వాలిఫైయర్-2లో గుజరాత్ అద్భుత కంబ్యాక్ ఇచ్చి మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లలో ఎవరు గెలిచినా ట్రోఫీని రెండోసారి ముద్దాడుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా కీలకంగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గుజరాత్‌లో మే 30 నుంచి జూన్ 2 వరకు ప్రీ-మాన్‌సూన్ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా అహ్మదాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ డే ఏర్పాటు చేశారు. మే 31న మ్యాచ్ పూర్తిగా జరగకపోయినా లేదా మధ్యలో ఆగిపోయినా, మరుసటి రోజు జూన్ 1న మ్యాచ్‌ ను కొనసాగిస్తారు. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఆట మొదలవుతుంది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం ప్రభావం ఉంటే అంపైర్లు ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ఫలితం రావాలంటే రెండు జట్లూ కనీసం 5 ఓవర్లు ఆడాలి. అలాంటి పరిస్థితుల్లో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ విధానం ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. అయితే రెండు రోజులు కూడా పూర్తిగా వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే మరో కీలక నిబంధన అమల్లోకి వస్తుంది. ట్రోఫీని రెండు జట్లకు పంచడం కాకుండా.. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్టునే ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. ఈ రూల్ వర్తిస్తే ఆర్‌సీబీ మరోసారి ఛాంపియన్ గా నిలుస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu