హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆనలేదని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని కేటీఆర్ బడాయి కబుర్లు చెపుతున్నారని ఆగ్రహించారు. కేసీఆర్ హయాంలో 12 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్‌పైన తొలి సంతకం చేసింది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే అని ప్రస్తావించారు. రైతును రాజు చేయాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఏనాడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని అన్నారు.. గత యాసంగి సీజన్‌లో విద్యుత్ ఇవ్వలేదని ఏ సబ్‌స్టేషన్ దగ్గర చిన్న ధర్నా కూడా జరగలేదని.. అది తమ నిబద్దత అని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా తమ ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం రైతు డిస్కం పెడితే కేటీఆర్‌కు ఎందుకు అంత నొప్పి ఎందుకని ప్రశ్నించారు. రైతు ప్రయెజనాల కోసమే డిస్కం ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. మోటార్లకు మీటర్లు పెట్టమని తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని.. అయినా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఒకవేళ తాము మీటర్లు పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదా అని సీఎం ఛాలెంజ్ విసిరారని అన్నారు. ముఖ్యమంత్రి సవాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదు..? అని నిలదీశారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆయన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ లక్షలాది మంది కార్యకర్తలు చూస్తు ఉరుకోరని హెచ్చరించారు. కేటీఆర్ రైతుల విషయంలో దుష్పచారం మానుకోవాలని హితవు పలికారు.
0 Comments