Ad Code

పాకిస్తాన్‌లో భరించలేని స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం : లీటర్ పెట్రోల్ రూ.400


ధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావం పాకిస్తాన్‌లోని సామాన్య పౌరుల దైనందిన జీవితాలపై తీవ్రంగా పడుతోంది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు, ఆకాశాన్నంటుతోన్న జీవన వ్యయాలు చూసి రాజధాని ఇస్లామాబాద్ నివాసితులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికే భరించలేని స్థాయికి చేరుకుంది. స్థిరమైన జీతాలు వచ్చే ఉద్యోగులు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక అల్లాడిపోతున్నాయి. కీలకమైన చమురు రవాణా మార్గమైన 'హోర్ముజ్ జలసంధి' ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటాయి. స్థానిక ప్రజల సమాచారం ప్రకారం.. గతంలో లీటరుకు సుమారు రూ. 250 ఉన్న పెట్రోల్ ధర ఏకంగా రూ. 450కి చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గినప్పటికీ ప్రస్తుతం లీటరుకు రూ. 400 కంటే పైనే పలుకుతోంది. డీజిల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించి, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరి లెక్కల ప్రకారం దేశంలో ద్రవ్యోల్బణం ఏకంగా 300 శాతం పెరిగింది. ఈ దారుణ పరిస్థితులపై ఇస్లామాబాద్‌కు చెందిన ఒక పౌరుడు స్పందిస్తూ.. “జీతాలు అలాగే ఉన్నాయి కానీ ధరలు మాత్రం కొండెక్కి కూర్చున్నాయి. ఇంధనం కొనలేక నెల రోజులుగా నా కారును పక్కన పెట్టేశాను. ఇప్పుడు కనీసం బైక్ కొనే పరిస్థితి కూడా లేదు. బతకడం దాదాపు అసాధ్యంగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న సైనిక చర్యలు, క్షిపణి దాడులు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహ్య శక్తుల జోక్యం వల్లే ఈ ప్రాంతంలో అస్థిరత పెరుగుతోందని ఇస్లామాబాద్ నివాసితులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఇరు పక్షాలు ఘర్షణలను విరమించి, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని వారు కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu