Ad Code

రూ.1.22 కోట్ల నగదును పట్టుకున్న రైల్వే పోలీసులు


ముంబాయి నుంచి సికింద్రాబాద్‌కు తరలిస్తున్న కోటి 22 లక్షల 70 వేల నగదును రైల్వే పోలీసులు పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ముంబాయి నుంచి వచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన విజయ అంబాదాస్‌ గుప్తా అనే వ్యక్తి మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌లో దిగాడు. పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా రైల్వే పోలీసులు అనుమానంతో అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. ఆ బ్యాగ్‌లో భారీగా నగదు ఉండడంతో అతన్ని లోతుగా విచారించగా నగదు వివరాలను బయట పెట్టాడని రైల్వే పోలీసులు వెల్లడించారు. ఈ నగదును సికింద్రాబాద్‌ మోండా మార్కెట్లో జువెల్లరీ షాప్‌ నడుపుతున్న బంటీ అనే వ్యక్తికి చేరవేయడానికి వచ్చాడని వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా విజయ అంబదాస్‌ గుప్తాకు రూ.5వేలు ఇస్తామని ఇరువురు మధ్య ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. హవాలా డబ్బును పట్టుకున్న పోలీసు సిబ్బందిని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

Post a Comment

0 Comments

Close Menu