జాతీయ పక్షి నెమలి గాయపడి, కుంటుకుంటూ రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో అది ప్రాణాపాయ స్థితికి చేరింది. దీనిని గమనించిన జనం ఆ మూగజీవికి సాయం చేయాల్సింది పోయి, దాని ఈకలను పీక్కోవడంలో తలమునకలయ్యారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. 'మాతృ భూమి'అందించిన కథనం ప్రకారం.. రోడ్డు పక్కన గాయపడి పడి ఉన్న ఆ నెమలిని చూసి జనం అక్కడ గుమిగూడారు. ఆ నెమలి నడవలేక, ఎగరలేక తీవ్ర వేదన అనుభవిస్తుంటే, వారు కనీస మానవత్వం చూపలేదు. అటవీ శాఖ అధికారులకో లేదా వెటర్నరీ వైద్యులకో సమాచారం అందించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో అక్కడున్న కొందరు ఆ నెమలి శరీరం నుంచి బలవంతంగా ఈకలను పీకేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాకవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధలో ఉన్న జీవిని ఆదుకోవడానికి బదులుగా, ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో కరుణ, కనికరం అనేవి లేకుండా పోతున్నాయని, ఇలాంటి ఘటనలు మానవత్వం పతనమవుతున్నదనడానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదికగా పలువురు అంటున్నారు.
0 Comments