ఆపిల్ సంస్థ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించిందన్న ఆరోపణలపై ఐఫోన్ యూజర్లకు భారీగా నష్ట పరిహారం చెల్లించబోతోంది. వినియోగదార్లకు తెలీకుండా, వాళ్ల అనుమతి లేకుండా యాపిల్ పరికరాల్లో 'సిరి'ని రహస్యంగా యాక్టివేట్ చేసినట్లు ఆపిల్ కంపెనీపై ఐదు సంవత్సరాల క్రితం కోర్టులో కేసు నమోదైంది. ఆ కేసును సెటిల్ చేసుకునేందుకు, ఆపిల్ కంపెనీ ఇప్పుడు 95 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 814 కోట్లు) చెల్లించేందుకు సిద్ధపడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టుకు సమర్పించింది. ఆపిల్ కు చెందిన ఐఫోన్లు, మరికొన్ని పరికరాల్లో, వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ 'సిరి'ని ఆపిల్ ఇన్స్టాల్ చేసింది. వాస్తవానికి... ఐఫోన్ యూజర్ 'హే సిరి', 'సిరి' లేదా మరేదైనా నిర్దిష్ట కీవర్డ్ ను పలికినప్పుడు మాత్రమే సిరి యాక్టివేట్ కావాలి, యూజర్ అడిగిన సమాచారాన్ని వెల్లడించాలి. కానీ, 'హే సిరి' వంటి పదాలను యూజర్ పలకపోయినా, అంటే సిరిని యాక్టివేట్ చేయకపోయినా దానంతట అదే యాక్టివేట్ అవుతోందన్నది ఆపిల్ కంపెనీపై వచ్చిన ఆరోపణ. తద్వారా, ఐఫోన్ ద్వారా చేసే సంభాణలతో పాటు, ఐఫోన్ కు దూరంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కూడా సిరి వింటోందని కోర్టు కేసులో ఆరోపించారు. ఆ మాటలను వ్యాపార ప్రకటనలు జారీ చేసే సంస్థలతో సిరి పంచుకునేదని, తద్వారా, ఆయా కంపెనీలు యూజర్ మాటల్లో వినిపించే వస్తువులకు సంబంధించిన ప్రకటనలు ఐఫోన్లలో వచ్చేలా చేసి, వస్తువులు అమ్మేవాళ్లని లా సూట్ లో పేర్కొన్నారు. వినియోగదార్ల వ్యక్తిగత వ్యక్తిగత గోప్యతకు ఇది పూర్తి విరుద్ధమని కోర్ట్ లో వాదించారు. కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆపిల్ కంపెనీ గతంలో చాలాసార్లు చెప్పింది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా వ్యక్తిగత గోప్యత కూడా ఒక "ప్రాథమిక హక్కు" అని అనేకసార్లు స్పష్టం చేశారు. కానీ, సిరి వ్యవహారం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, పరిహారం ఇచ్చి ఈ కేసును సెటిల్ చేసుకునేందుకు ఆపిల్ ప్రతిపాదించింది. విచిత్రం ఏంటంటే తాము తప్పు చేసినట్లు ఆ సెటిల్మెంట్ పేపర్లలో ఆపిల్ కంపెనీ అంగీకరించలేదు. ఆపిల్ ప్రతిపాదించిన పరిహారాన్ని న్యాయమూర్తి ఆమోదించాలి. దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించడానికి, ఓక్లాండ్ కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. ఆపిల్ సెటిల్ మెంట్ కు ఆమోదం లభిస్తే 2014 సెప్టెంబర్ 17 నుంచి గత సంవత్సరం చివరి వరకు ఐఫోన్ లు, ఇతర ఆపిల్ పరికరాలు కలిగి ఉన్న దాదాపు పది లక్షల మంది వినియోగదార్లు క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. మొత్తం క్లెయిమ్ సంఖ్యను బట్టి చెల్లించే మొతాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. సిరి ఫీచర్ తో ఉన్న డివైజ్ కలిగి ఉన్న ప్రతి యూజర్ 20 అమెరికన్ డాలర్ల వరకు పరిహారం పొందవచ్చు. అర్హత కలిగిన వినియోగదారులు గరిష్టంగా ఐదు పరికరాలపై పరిహారం పొందవచ్చు.
వినియోగదార్లకు భారీగా నష్ట పరిహారం చెల్లించనున్న ఆపిల్ ?
by Telugu Lo Computer at January 03, 2025
Labels:
95 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధపడింది
,
apple
,
science
,
technology
,
యాపిల్ పరికరాల్లో 'సిరి'
,
వినియోగదార్లకు భారీగా నష్ట పరిహారం చెల్లించనున్న ఆపిల్ ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment