Ad Code

హెచ్‌ఎంపీవీ వైరస్‌పై కర్ణాటక ప్రభుత్వం అడ్వైజరీ విడుదల ?

                                               

బెంగళూరు నగరంలో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకడంతో అక్కడి కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్‌ కొవిడ్‌లా వ్యాప్తి చెందేది కాదని, అందువల్ల ఎవరూ భయపడొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే  ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని కోరింది. ఈ శ్వాసకోశ సంబంధిత వైరస్‌ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని, వారిలో సాధారణంగా జలుబు వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైరెక్టరేట్‌ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడ్వైజరీలో పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజాలాంటి అనారోగ్యం, తీవ్రమైన ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వంటి కేసులను రిపోర్టు చేయాలని రాష్ట్రంలోని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు సూచనలు చేసింది. ఎవరైనా దగ్గు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కును కప్పి ఉంచుకోవాలని, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని డీఎంఈ సూచించింది. ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నవారు, రోగులకు సన్నిహితంగా ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. వాడిన టిష్యూ పేపర్లు తిరిగి ఉపయోగించొద్దని.. రుమాలు, తువ్వాలును షేర్‌ చేసుకోవద్దని కోరింది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దని ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. డీఎంఈ తెలిపిన వివరాల ప్రకారం హెచ్‌ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి ఫ్లూలాంటి లక్షణాలు కనబడతాయి. మరింత తీవ్రమైన కేసుల్లో అయితే ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది బ్రాంకైటిస్‌, నిమోనియాకు దారితీయొచ్చని తెలిపింది. హెచ్‌ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్‌ చికిత్స, టీకాలు అందుబాటులో లేవన్న డీఎంఈ తగిన విశ్రాంతి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వంటి చర్యలు కొంత ఉపశమనం కలిగిస్తాయని తెలిపింది. తీవ్రమైన కేసుల్లో అయితే, ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్‌ థెరపీ, ఐవీఫ్లూయిడ్స్‌ అవసరమవుతాయని పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu