అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘించడం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి ఆనవాయితీగా మారింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. సోమవారం సంప్రదాయ ప్రసంగాన్ని చేయకుండానే అసెంబ్లీ నుంచి ఆయన వెళ్లిపోయారు. గవర్నర్ చర్యను ఆ రాష్ట్ర సిఎం ఎం.కె స్టాలిన్ తప్పుపట్టారు. గవర్నర్ చర్యను చిన్నపిల్లల చేష్టగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 'అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చేయడం సంప్రదాయంలో భాగం. అయితే ఆ పద్ధతిని ఉల్లంఘించడం గవర్నర్‌కు అలవాటుగా మారింది. గతంలో సిద్ధం చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను చేర్చి, కొన్నింటిని తొలగించి చదివారు. అయితే ఈసారి మాత్రం ప్రసంగాన్ని చదవకూడదనే నిర్ణయించుకున్నారు. గవర్నర్ చర్య చిన్నపిల్లల చేష్టగా ఉంది. తమిళనాడు ప్రజల్ని, ప్రభుత్వాన్ని అవమానించేలా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలు గవర్నర్ పదవికి తగనివి. ఆ పదవికి గౌరవాన్ని ఇవ్వవు' అని స్టాలిన్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి ఇష్టపడకపోతే గవర్నర్ తన పదవిలో ఎందుకుండాలనేదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న అని స్టాలిన్ అన్నారు. కాగా, నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గర్నర్ సంప్రదాయ ప్రసంగం ముందు రాష్ట్ర గీతం 'తమిళ్ థారు వజ్తు' గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించలేదు. దీంతో గవర్నర్ తన ప్రసంగం ముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
0 Comments