Ad Code

ట్రంప్‌నకు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్మా అవార్డు, చియోన్మాచాంగ్ కిరీటం నకలు !


సియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు చేరుకున్న ట్రంప్‌నకు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్మా అత్యున్నత అవార్డును, చియోన్మాచాంగ్ కిరీటం నకలును బహుమతిగా ఇవ్వనున్నారు. కాగా గ్యోంగ్జు నేషనల్ మ్యూజియాన్ని సందర్శించనున్న ట్రంప్‌నకు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌ ఈ కిరీటాన్ని అందజేయనున్నారు. కొరియా ద్వీపకల్పంలో సుదీర్ఘకాలం శాంతిని నెలకొల్పిన సిల్లా చరిత్రకు ప్రతీకగా ఈ కిరీటాన్ని అందిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడానికి ట్రంప్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అత్యున్నత అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఆ కార్యాలయం పేర్కొంది. మలేషియా, జపాన్‌లలో పర్యటన ముగించుకుని ట్రంప్ దక్షిణ కొరియా చేరుకున్నారు. అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ పరిస్థితులపై ట్రంప్, లీ జే-మ్యుంగ్‌ ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు జరపనున్నారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడి కోసం లీ జే-మ్యుంగ్‌ ఒక ప్రత్యేకమైన విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందుకు వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నేతలు హాజరవనున్నారు. మంగళవారం జపాన్‌లో పర్యటించిన సమయంలో, ఆ దేశ ప్రధాని సనాయె తకాయిచి, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu