Ad Code

పెంచే సినిమా టికెట్ రేట్లలో కార్మికులకు 20 శాతం : లేకుంటే టికెట్‌ ధరల పెంపుకు జీఓ ఇవ్వం


హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడలో నిర్వహించిన సినీ కార్మికుల అభినందన సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ "సినీ కార్మికుల శ్రమ నాకు బాగా తెలుసు. మీ కష్టాలు తెలుసుకోలేనంతగా నా కళ్లు మూసుకోలేదు" అని అన్నారు. సినీ పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. "ఒకప్పుడు సినీ పరిశ్రమ అంటే మద్రాసే అనుకునే వారు. కానీ, నేడు తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్లగలిగింది. ఈ గౌరవం తెర వెనుక కష్టపడే కార్మికుల శ్రమ ఫలితమే" అని రేవంత్‌ అభినందించారు. నిలిచిపోయిన నంది అవార్డులను ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ పేరుతో అవార్డులను ఇస్తున్నామని సీఎం తెలిపారు. "హాలీవుడ్ కూడా తెలంగాణకు వచ్చి షూటింగ్‌ చేసుకునేలా మారాలి. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదు. ఐటీ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, సినిమా పరిశ్రమకూ అంతే ప్రాధాన్యత ఇస్తాం" అని ఆయన అన్నారు. సినీ కార్మికుల సంక్షేమంపై సీఎం పలు కీలక హామీలు ఇచ్చారు. "కృష్ణా నగర్‌లో మూడు నుంచి నాలుగు ఎకరాల్లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మిస్తాం. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం లంచ్‌ కూడా అందిస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం కూడా అందిస్తాం" అని చెప్పారు. తన మాటకు కట్టుబడి కృష్ణానగర్‌కు వచ్చానని గుర్తుచేసిన రేవంత్‌.. "కార్మికుల కోసం ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తాం. వెల్ఫేర్‌ ఫండ్‌కు 10 కోట్లు ఇస్తున్నాం. కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం ఆ నిధులు వినియోగించండి" అని అన్నారు. అంతేకాకుండా, "సినిమా టికెట్‌ రేట్లు పెంచాలంటే కార్మికులకు 20 శాతం వాటా తప్పనిసరి. ఆ వాటా వెల్ఫేర్‌ ఫండ్‌కు బదిలీ అవ్వాలి. లేదంటే టికెట్‌ ధరల పెంపుకు జీఓ ఇవ్వం" అని స్పష్టం చేశారు. నిర్మాతలు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా ఉండాలని సూచించారు. ఫైటర్స్‌, టెక్నీషియన్ల నైపుణ్యం పెంచేందుకు ఫ్యూచర్‌ సిటీలో భూమి కేటాయిస్తామని తెలిపారు. "మీకు అవసరం ఉన్నప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ వెన్నంటి ఉంటుంది" అని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu