ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు భారీ ప్రమాదం తప్పింది. వరదలో కొట్టుకు వచ్చిన 30 టన్నుల భారీ బోటు బ్యారేజ్ గేట్లకు అడ్డంగా పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తుఫాన్ కారణంగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లేలాయి. పెన్నా నదిపై ఉన్న సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. అదే సమయంలో భారీ బోటు ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజ్ వైపు చేరింది. అది గేట్లను తాకే పరిస్థితి వస్తే బ్యారేజ్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ చేపట్టారు. వారి ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు గస్తీ సిబ్బంది, పోలీసు విభాగం, వ్యవసాయ శాఖ అధికారులు సమిష్టిగా పని చేశారు. దాదాపు 100 మంది సిబ్బంది సహకారంతో ఆ బోటును విజయవంతంగా తొలగించారు. 3.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి ఆధారమైన సంగం బ్యారేజ్ ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా యంత్రాంగం సమయోచితంగా స్పందించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా అధికారులను అభినందిస్తూ, "ఆ బోటు అలాగే కిందకు వెళ్లి ఉంటే బ్యారేజ్ గేట్లను ఢీకొని భారీ నష్టం జరిగేదే" అని పేర్కొన్నారు. అధికారుల ప్రకారం, బిరపేరు, బోగ్గేరు వాగుల్లో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు సంగం బ్యారేజ్ వద్ద నీరు 11 అడుగులకు చేరుకుంది. ఈ వరద వేగం కారణంగా వంతెన రైలింగ్‌కు కట్టిన మూడు బోట్ల తాళ్లు తెగిపోయాయి. వాటిలో ఒకటి ఇసుక తిన్నెల్లో చిక్కుకోగా, మరోటి కనిగిరి రిజర్వాయర్ వైపుకు వెళ్లింది. మూడో బోటు మాత్రం బ్యారేజ్‌కు కేవలం 400 మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో వెంటనే చర్యలు తీసుకుని రక్షించారు.
0 Comments