కొంతకాలంగా వేధిస్తున్న యువకుడిని ఎదిరించిన విద్యార్థిని : స్నేహితులుతో కలిసి యాసిడ్ దాడికి పాల్పడిన దుండగుడు
వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో తనను కొంతకాలంగా వేధిస్తున్న యువకుడిని ఎదిరించిన విద్యార్థినిపై అతడు, అతడి స్నేహితులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె చేతులకు కాలిన గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఆదివారం ఉదయం స్పెషల్ క్లాస్ కోసం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. బాధితురాలు నివసించే ముకుంద్‌పూర్‌కే చెందిన జితేందర్ అనే యువకుడు ప్రధాన నిందితుడని, అతడితో పాటు ఇషాన్, అర్మాన్ ఈ దాడిలో పాల్గొన్నారని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను తీసుకున్న అర్మాన్ ఆమెపై యాసిడ్ పోశాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తన ముఖాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డుపెట్టడంతో, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని వెంటనే సమీపంలోని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక విచారణలో జితేందర్ గత కొన్ని నెలలుగా యువతిని వెంబడిస్తూ వేధిస్తున్నట్లు తేలింది. సుమారు నెల రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.