Ad Code

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జిల్లాల ప్రజలకు అటవీ శాఖ అధికారులు అలర్ట్ జారీ


తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని జిల్లాల ప్రజలకు ఈ పరిసర ప్రాంతాల్లో పులి సంచరించడంతో అటవీ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఎరుపు రంగు దుస్తులు ధరించవద్దని, ఉదయం 10 గంటల తర్వాతే బయటకు వెళ్లాలని, సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరాలని సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని మెట్ ఇంధాని అటవీ ప్రాంతానికి మహారాష్ట్ర సరిహద్దు నుంచి పులులు సంచరిస్తున్నాయి. ఇవి పశువుల మీదనే కాక పొలాల్లో పని చేసే కూలీల మీద కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 18న సిర్పూర్ (టి) రేంజి పరిధిలోకి ప్రవేశించిన పులి ఒకటి ఆవు మీద దాడి చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పులి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. ఒక వారం రోజుల నుంచి ఇది మండలంలోని గెర్రెగూడ, రాస్పెల్లి, సార్సాల పరిసరాల్లో సంచరించిన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చిన పులి వారం రోజుల నుంచి పెంచికల్పోట్, సిర్పూర్(టి), కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని పాతసార్సాల, గెర్రెగూడ, రాస్పెల్లి గ్రామ పరిసరాల్లో సంచరిస్తోంది. పత్తి పంట చేతికి వచ్చిన వేళ.. ఇలా పులి సంచరించడం.. రైతులను భయపెడుతోంది. గతంలో దాడి చేసిన ఘటనలు గుర్తు చేసుకుంటున్న రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లడానికే భయపడుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో రేయింబవళ్లు గస్తీ కాస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu