బెంగళూరులో కొందరు టెక్కీలు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఊహించని పనులు చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బాయ్‌లుగా, ట్యాక్సీ డ్రైవర్లు సేవలందిస్తూ రిలాక్స్ అవుతున్నట్లు తెలిపారు. పగలంతా ఉద్యోగంలో బిజీగా ఉండి, రాత్రి కాగానే కొత్త అవుతారం ఎత్తుతున్నారు. మరికొందరు డబ్బు కోసమే చేస్తున్నారు. రాత్రి సమయాలో ఈ వృత్తుల్లోకి మారుతున్నారు. సంపాదిస్తున్న డబ్బులు సరిపోవడం లేదా? లేదా ఊరికే టైంపాస్ కోసం ఇలా చేస్తున్నారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి. ఇవే ప్రశ్నలను కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ప్రశ్నిస్తే ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయి. బెంగళూరు రోజురోజుకి ఎంతో ఖరీదు అయిన నగరంగా మారుతోంది. అందులోనూ ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ప్రతి టెక్కీకి అందరూ అనుకున్నట్లుగా పెద్ద పెద్ద జీతాలు లభించడం లేదు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వేతనం లభిస్తోంది. ఆ డబ్బు చాలక అదనపు మార్గాలను అన్వేస్తున్నారు. పలువురు యువ ఇంజనీర్లు వారానికి రెండు రాత్రులు అయినా క్యాబ్ నడుపుతూ సంపాదిస్తారు. బెంగళూరు టెక్కీలకు జీవితం ఒక యాంత్రికంగా మారిపోయింది. ఉదయాన్నే లేవడం, రెడీ కావడం, ఆఫీసుకు వెళ్లడం, అక్కడ రోజంతా ఒత్తిడిలో కష్టపడడం, టార్గెట్లు, తిరిగి ఇంటికి రావడం, పడుకోవడం ఇలా ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడ్డారు. దీంతో జీవితంలో ఒంటరితనం పెరుగుతోంది. అలాగే మానసిక సమస్యలు, కోపం, ఉద్వేగాలు నియంత్రణలో లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటకు వచ్చేందుకు తరచూ ట్రెక్కింగ్ వెళ్లడం, నైట్ పార్టీలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఆశించిన మేర వారికి ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో ఒక మార్పు కోసం రాత్రి సమయాల్లో ఇతర వ్యాపకాలను అనుసరిస్తున్నారు.
0 Comments