సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో దయా చౌదరిపై ఫిర్యాదు చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో దయా చౌదరి అనే వ్యక్తిపై మరో ఫిర్యాదు చేశారు మెగాస్టార్. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ ప్రొఫైల్స్‌పై చిరంజీవి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి వీరు మరింత వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. కాగా చాలా మంది సెలబ్రిటీల్లాగే మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆయన మార్ఫింగ్ ఫొటో లు, వీడియోలు కొన్ని వెబ్ సైట్లలో కనిపించాయి. దీనిపై చిరంజీవి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.