తిరుమలలో రోజురోజుకీ భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం కొత్త ఏర్పాట్లను చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తిరుమలకు చేరుకునే సమయంలో ఎక్కువసేపు నిలబడాల్సి రావడం, వర్షం, ఎండ కారణంగా ఇబ్బందులు పడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, నూతనంగా క్యూలైన్ మార్గాలు, షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో ఈ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాటగంగమ్మ ఆలయం నుంచి గోగర్భం జలాశయం కూడలి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర శాశ్వత క్యూలైన్ల నిర్మాణం జరగనుంది. మొత్తం రూ.17.60 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఈ మార్గంలో భక్తుల కోసం షెడ్లు, సౌకర్యవంతమైన మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డులు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం పూర్తయ్యాక భక్తులు సులభంగా, క్రమబద్ధంగా దర్శనానికి చేరుకోగలరని అధికారులు తెలిపారు.
0 Comments