Ad Code

ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు : కట్టుకథ అని తెలిసి పోలీసులు బిత్తరపోయారు


ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై కొందరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారని ఆ సమయంలో తాను ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసులు నిజమని నమ్మి కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా ఆ యువతి, ఆమె తండ్రి కట్టుకథ అని తెలిసి పోలీసులు బిత్తరపోయారు. ఘటనా స్థలిలో సీసీ కెమెరాలు, నిందితుల ఫోన్లు ట్రాకింగ్ లాంటి అధునాతన సాంకేతికతో కేసును ఛేదించారు. ఓ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ విద్యార్థిని తండ్రి రచించిన పథకంగా పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న విద్యార్థిని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాసిడ్ దాడికి పాల్పడినట్లు చెబుతున్న ఆ ముగ్గురు యువకుల్లో ప్రధాన నిందితుడిగా భావించిన జితేందర్ భార్యపై విద్యార్థిని తండ్రి వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై అతడిపై కేసు కూడా నమోదైనట్లు తేలింది.తనపై కేసు పెట్టారన్న కోపంతో తన కూతుర్ని ఈ విధంగా యాసిడ్ దాడి నాటకం ఆడించి.. ఆ ముగ్గురే తనపై దాడి చేశారని చెప్పమన్నాడు. ఆ విద్యార్థిని తండ్రి చెప్పినట్లు యాసిడ్ దాడి ప్లాన్ ను అమలు చేసింది. ఎట్టకేలకు తండ్రి ముందే ఆ యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇదేం ట్విస్ట్ రా నాయనా అంటూ అవాక్కయ్యారు. అయితే యువతిపై చల్లింది యాసిడ్ కాదని.. అది టాయిలెట్ క్లీనర్ అని తేలింది. అంతేకాక యువతి చేతులకు ఏమీ కాలేదని.. బ్యాండేజీ కట్లు కట్టి ఆ ముగ్గురు యువకుల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అబద్ధపు ఫిర్యాదు చేసి, తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు ఆ విద్యార్థిని, ఆమె తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే దేశ రాజధానిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu