సీఎన్ఏపీ సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టడానికి ట్రాయ్ అంగీకారం


కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (సీఎన్ఏపీ) సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టడానికి ట్రాయ్ అంగీకరించింది. ఇకపై కాల్ చేసిన వారి పేరు నంబర్‌తో పాటు రిసీవ్ చేసుకొనే వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సేవ అమలుకు సంబంధించిన చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. 1997 ట్రాయ్ చట్టంలోని సెక్షన్ 11(1)(a) ప్రకారం సీఎన్ఏపీ సేవ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు ఇవ్వాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) 2022 మార్చిలో ట్రాయ్‌ను సంప్రదించింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ట్రాయ్ తన తొలి సిఫార్సులను సమర్పించగా, 2025 సెప్టెంబరులో డాట్ పునఃపరిశీలన కోరింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజాగా ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వ సూచనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని కీలక మార్పులతో తన మునుపటి సిఫార్సులను పునరుద్ధరించింది. సీఎన్ఏపీ సేవ ప్రధానంగా మోసపూరిత, స్పామ్ కాల్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా దశలవారీగా ప్రవేశపెట్టబడుతుంది. ఇది అన్ని వినియోగదారులకూ డీఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, అవసరమైతే ఆప్షనల్‌గా డిసేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారుల పేర్లు కేవైసీ  ధృవీకరించిన వివరాల ఆధారంగా చూపిస్తాయి. లైసెన్సింగ్ నియమాల్లో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ నిర్వచనాన్ని విస్తరించి.. కాలింగ్ నేమ్ ను కూడా చేర్చనున్నారు. గోప్యత రక్షణలో భాగంగా సీఎల్ఐపీ ఎంచుకున్న వినియోగదారుల పేర్లు మాత్రం ప్రదర్శించబడవు. వ్యాపార వినియోగదారులు తమ ట్రేడ్ నేమ్ లేదా ట్రేడ్‌మార్క్‌ను కాలర్ ఐడెంటిటీగా చూపించుకునే వీలు ఉంటుంది. కానీ, అది ప్రభుత్వ ధృవీకరణ ప్రక్రియకు లోబడి ఉంటుంది. అలాగే కొత్త మొబైల్ పరికరాల్లో సీఎన్ఏపీ ఫీచర్ తప్పనిసరిగా ఉండేలా ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేయాలని ట్రాయ్ ప్రకటించింది. ఈ సేవను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఐటీయూ, ఈటీఎస్ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ సేవగా వర్గీకరించారు. ట్రాయ్ తాజా నిర్ణయం మేరకు డాట్ టెలికాం ఆపరేటర్లకు ఒక వారంలో కనీసం ఒక సర్కిల్‌లో సీఎన్ఏపీ సేవ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 60 రోజుల పైలట్ దశ పూర్తి చేసిన అనంతరం దేశవ్యాప్త రోల్‌అవుట్ జరగనుంది. ఈ కొత్త మార్పు ద్వారా కాల్ ట్రాన్స్‌పరెన్సీ పెరగడం, స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌ను సమర్థవంతంగా అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Post a Comment

0 Comments