అమెరికా వర్క్ పర్మిట్ రెన్యువల్ విషయంలో గతంలో ఉన్న 'ఆటోమేటిక్ ఆథరైజేషన్' నిబంధనను రద్దు చేసింది. దీని ప్రభావంతో, రెన్యూవల్ కోసం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పటికీ గతంలో ఉన్న 540 రోజుల పాటు పని చేసే అవకాశం ఇకపై ఉండదు. వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోగా కొత్త పర్మిట్ మంజూరు కాకపోతే, సంబంధిత మైగ్రెంట్‌కు ఉద్యోగ అనుమతి వెంటనే ఆగిపోతుంది. ఇది ముఖ్యంగా ఇండియన్ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలపై పెను ప్రభావం చూపనుంది. ఈ కొత్త నిబంధన వల్ల నేరుగా నష్టపోయే వ్యక్తుల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ల భాగస్వాములు (H4 వీసాదారులు), H-1B వీసా హోల్డర్ల భాగస్వాములు (H4 EAD), అలాగే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) లోని విద్యార్థులు వర్క్ ఎక్స్‌టెన్షన్స్ OPTపై ఉన్నవారు ఉన్నారు. USCIS ప్రాసెసింగ్ సమయాలు తరచుగా ఎక్కువ ఉండడం వలన, ఈ మార్పు వల్ల రెన్యూవల్ ప్రక్రియలో ఆలస్యం జరిగితే లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయ మైగ్రెంట్లకు తాత్కాలికంగానైనా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. కొత్త పర్మిట్ వచ్చే వరకు వారు విధిగా 'అన్‌పెయిడ్ లీవ్' తీసుకోవాల్సి వస్తుంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పౌరుల భద్రతకు, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, దరఖాస్తుదారుల స్ర్కీనింగ్‌ను మరింత పటిష్టం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఇమ్మిగ్రేషన్ నిపుణులు, వలసదారుల హక్కుల సంఘాలు ఈ మార్పును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. USCIS తన ప్రాసెసింగ్ సమయాలను మెరుగుపరచడంలో విఫలమవడం వల్లే ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ అవసరం ఏర్పడిందని, ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేయడం ప్రభుత్వ అసమర్థతకు వలసదారులను శిక్షించడమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు కూడా నష్టం చేకూరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవరించిన నిబంధనల దృష్ట్యా, ప్రభావితమైన వర్గాలు గడువు ముగిసే ప్రమాదం రాకముందే మేల్కోవాలి. USCIS ఇప్పుడు EAD రెన్యూవల్ కోసం గడువు ముగియడానికి 180 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని గట్టిగా సూచిస్తోంది. ఈ మార్పు అక్టోబర్ 30, 2025 నుండి అమలులోకి వస్తుంది. అందువల్ల, వలసదారులు తమ వర్క్ పర్మిట్ రెన్యూవల్ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా సమర్పించడం, వారి చట్టబద్ధమైన ఉద్యోగ స్థితికి అంతరాయం కలగకుండా చూసుకోవడం అత్యవసరం. నిరంతరాయంగా ఉద్యోగం చేయగలిగేందుకు ముందస్తు ప్రణాళిక, దరఖాస్తుల వేగవంతమైన సమర్పణ కీలకం.
0 Comments