రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ వైపు దూసుకుపోతున్న గుజరాతీ సినిమా 'లాలో'
సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరు. అలా చాలా చిన్న సినిమాలు ఎలాంటి హడావుడి, హంగూ ఆర్భాటం లేకుండా సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడు గుజరాత్ లో ఓ చిన్న సినిమా కూడా అలాంటి విధ్వంసమే సృష్టిస్తోంది. రిలీజై 50 రోజుల కావొస్తున్నా రూ. 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే.. దర్శకుడు తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఎవరినీ అడిగినా గుజరాతీ సినిమా 'లాలో' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు.. తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. గతనెల అంటే అక్టోబర్ 10న చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మెల్లగా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.