తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌పై లోతైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విజన్ డాక్యుమెంట్ పాలసీని డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌లోనే ‘తెలంగాణ విజన్ 2047’ పాలసీని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా, మొదటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రెజెంట్ చేయడంతో పాటు, అన్ని వర్గాలకు, రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రెండవ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యం తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ స్థాయికి చేర్చడం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఏ రంగాలను (పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, ఫార్మా వంటివి) ప్రోత్సహించాలి, కొత్త విధానాలను ఎలా అమలు చేయాలి అనే అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమీక్షలో లోతుగా చర్చించారు.
0 Comments