ఆంధ్రప్రదేశ్ లో కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకం ప్రయోజనాలు తమకు అందడం లేదని ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకి ప్రయోజనం కలిగే విధంగా వైద్యారోగ్యశాఖ జీవో జారీ చేసింది. దీంతో 24 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ స్కీం( ఇహెచ్ఎస్) నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, లోపాలను గుర్తించి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో ఉద్యోగ సంఘాలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు గత నెలలో మంత్రుల కమిటీ , ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావించారు. వారు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గతనెల 18న ముఖ్యమంత్రి ప్రకటించారు. తదనుగుణంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు కమిటీ కూర్పుపై నిర్ణయం తీసుకున్నారు. సీఎస్ విజయానంద్ నేతృత్వం వహించే ఈ కమిటీలో జిఎడి విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఉద్యోగ సంఘాల ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ 8 వారాల్లో ఇహెచ్ఎస్ పటిష్ట అమలుపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైన ఇహెచ్ఎస్ పథకంలో మొత్తం 23, 58,858 లబ్దిదారులున్నారు. వీరిలో 5,53,182 మంది ఉద్యోగులు, 2,29,964 మంది పింఛనుదారులు, 81,748 మంది కుటుంబ పింఛనుదారులతో పాటు వారి కుటుంబ సభ్యులున్నారు. ఈ పథకంపై అయ్యే ఖర్చులో ప్రభుత్వం మరియు లబ్దిదారులు చెరి సగం భరిస్తారు. సాలీనా దాదాపు రూ.350 కోట్ల మేర ఖర్చవుతోంది. గత నెలలో మంత్రుల బృందం మరియు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వైద్య సేవలకోసం చేసిన ఖర్చును సకాలంలో చెల్లించకపోవడం, వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలను పెంచకపోవడం, ఇహెచ్ఎస్ కింద సేవలందించడానికి ఆసుపత్రుల నిరాసక్తత, పర్యవేక్షణ లోపం, ఫిర్యాదుల పరిష్కారం జరగకపోవడం, ఇహెచ్ఎస్ అమలుకోసం వినియోగిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్ పరిమిత సామర్ధ్యాన్ని ప్రస్తావించారు.
0 Comments