జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపైనే కౌన్సిల్‌లో చర్చ !


వచ్చే నెల జరగబోయే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పన్ను రేట్ల హేతుబద్ధీకరణపై చర్చ ఉండబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, పన్నులు, శ్లాబుల్లో మార్పులపై తుది నిర్ణయం తర్వాత తీసుకోనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 9న 54వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. విలాసవంత వస్తువులు, హానికారక ఉత్పత్తులపై పరిహార సెస్‌ అంశంపైనా ఇదే సమావేశంలో చర్చించనున్నట్లు విలేకరులతో అన్నారు. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి నేతృత్వంలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) మొదటి సమావేశం ఇటీవల జరిగింది. ఆ భేటీలో పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయొద్దని కొందరు సభ్యులు సూచించారు. దీంతో ప్రస్తుతానికి 5, 12, 18, 28 ట్యాక్స్‌ శ్లాబులు కొనసాగుతాయని, దీనిపై మరింత చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని వస్తువులపై రేట్ల మార్పిడి వల్ల కలిగే ప్రభావాన్ని మదింపు చేయడానికి ట్యాక్స్‌ ఆఫీసర్లతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీకి అప్పగించినట్లు చౌదరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం గురించి సీతారామన్‌ మాట్లాడారు. రేట్ల హేతుబద్ధీకరణపై చర్చించనున్నామని, కమిటీ ఆఫీసర్లు దీనిపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. తదుపరి సమావేశాల్లో దీనిపై నిర్ణయం వెలువడనుందని చెప్పారు. పరిహార సెస్సును కొనసాగించాలని కర్ణాటక నుంచి డిమాండ్‌ వచ్చింది. పరిహార సెస్‌ను కొనసాగించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సీతారామన్ తెలిపారు.

No comments:

Post a Comment

3