బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ 'ఎక్స్' ట్విట్టర్‌లో మమతను నిలదీశారు. బుధవారం కోల్‌కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంగళవారం జరిగిన అల్లర్లపై మమత ప్రస్తావించారు. రాష్ట్ర సచివాలయానికి నబన్న అభిజన్ నిరసన మార్చ్ సందర్భంగా జరిగిన హింస జరిగింది. ఆ హింసా ఘటనలు బీజేపీ నేతృత్వంలోనే జరిగాయి. దీనికి తోడు ఆర్‌జీ కార్ ఘటనపై వెల్లువెత్తుతున్న విమర్శలు, వెరసీ బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం తరహాలో తమ ప్రభుత్వం పతనానికి అల్లర్లు జరుగుతున్నాయని అర్ధం వచ్చేలా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ''మోడీ జీ మీ ప్రజల ద్వారా మా రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మా రాష్ట్రాన్ని తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి' అని ఆమె అన్నారు. ''దీదీ..అసోంను బెదిరించడానికి మీకెంత ధైర్యం? మా మీద కళ్లు ఎర్ర చేయకండి. మీ రాజకీయ వైఫల్యాలకు ఇండియాను తగులపెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. విభజన భాషలో మీరు మాట్లాడటం సరికాదు'' అని హిమంత్ బిస్వా శర్మ ట్వీట్ చేశారు.
0 Comments