జస్టిస్ హేమ కమిటీ నివేదికలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారందరి పేర్లను బయటపెట్టాలంటూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈఎఫ్‌కేఏ) దర్శకుల యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన 'అమ్మ' తర్వాత అంత పేరు పొందిన సంస్థ 'ఎఫ్‌ఇఎఫ్‌కెఏ'. ''ప్రస్తుతం ఈ విషయం హైకోర్టులో ఉన్నందు వల్ల దీనిపై ఎక్కువగా స్పందించాలనుకోవడం లేదు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారి పేర్లను వెల్లడించాలి. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'సిట్'ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సరైన దర్యాప్తు చేసి ఇలాంటి వాటికి పాల్పడిన వారిని శిక్షించాలి'' అని ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ 'ఎఫ్‌ఈఎఫ్‌కేఏ' లో ఉన్న సభ్యులు నిందితులుగా ఉండి, విచారణలో నిజం నిర్ధారణ అయితే వారి అరెస్టు విషయంలో యూనియన్ ఎలాంటి జోక్యం చేసుకోదని స్ఫష్టం చేసింది. 'అమ్మ' సభ్యులు రాజీనామా చేయడంతో.. ఇప్పటికైనా ఆ సంస్థలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. జస్టిస్ హేమ కమిటీ నివేదికపై 'ఆట్టం' దర్శకుడు ఆనంద్ ఇకర్షి స్పందించారు. లైంగిక వేధింపుల గురించి తెలియజేస్తూ 'ఆట్టం'ను తెరకెక్కించినట్లు చెప్పారు. ''ఇది కేవలం ఒక సంఘటన ఆధారంగా రూపొందించలేదు. సినిమా రాసేటప్పుడు నా కథ ద్వారా లైంగిక వేధింపులు నేరం అని చెప్పాలనుకున్నా. ఇది సినీ పరిశ్రమలో జరుగుతుందా? మరికెక్కడైనా జరుగుతుందా?అని ఆలోచించలేదు. మహిళల కోసం సినిమా సెట్లు సురక్షితంగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలి. వ్యవస్థాగత మార్పులకు నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా కృషి చేయాలి. అంటూ ఆనంద్ వ్యాఖ్యానించారు. 'ఆట్టం' చిత్రం ఇటీవల మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
0 Comments