ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది పశ్చిమ వైపు దిశగా పైనుంచి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఎల్లుండి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. దీంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాలలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల తర్వాత అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవడానికి కారణం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఇక ఏపీలో ఈనెల 27, 28 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు ఇప్పటినుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇప్పటికే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం కారణంగా కురిసే వర్షాలతో తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు మత్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇదిలా ఉంటే ఏపీలో ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఏపీలో చలి తీవ్రత పెరిగింది.
0 Comments