తెలంగాణలోని రామగుండంలో మూతపడ్డ బీ పవర్ హౌస్ 62.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పవర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి, జెన్కో జాయింట్‌గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని, భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. ఈరోజు రామగుండంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీ పవర్ హౌస్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు బీ పవర్ హౌస్ గురించి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ చారిత్రాత్మకమైన పవర్ ప్రాజెక్టు 50 ఏళ్ల క్రితం ఏర్పడి ఈ ప్రాంతానికి వెలుగునిచ్చిందని తెలిపారు. సాగునీటిని కూడా తీసుకువచ్చిన ప్రాజెక్టు కాలం చెల్లడంతో మూసివేసే పరిస్థితికి వచ్చిందని అయన అన్నారు. భావోద్వేగమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న పవర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి జిల్లాల ప్రతినిధులు చర్చించామని తెలిపారు. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి, జెన్కో సంయుక్త వెంచర్‌గా పవర్ ప్రాజెక్టు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు.
0 Comments