అమెరికా ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. అనుకున్న సమయానికి విమానం ఎక్కే టైంలో సిబ్బంది అడ్డుకోవడంతో కోపం కట్టలు తెంచుకుంది. అంతే చేతికందిన సుత్తిని తీసుకుని టీవీ స్క్రీన్లు ధ్వంసం చేశాడు. ఈ పరిణామంతో సహా ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం అర్థరాత్రి శాంటియాగోలోని న్యూవో పుడాహుయెల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది. హైతీకి చెందిన ప్యాసింజర్.. ఏజెంట్ చేతిలో మోసపోయాడు. మోసగాడు డబ్బులు తీసుకుని నకిలీ విమాన టికెట్‌ను విక్రయించాడు. ఈ విషయం తెలియక విమానం ఎక్కేందుకు వస్తే సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రేకుడయ్యాడు. అంతే చిలీలోని అమెరికన్ ఎయిర్‌లైన్స్ కౌంటర్‌ను సుత్తితో ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాలు మొబైల్‌లో బంధించారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం కోసం ఫ్లోరిడాలోని మయామికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానిక మీడియా సంస్థ కోపరేటివా తెలిపింది. నకిలీ టికెట్ కారణంగా ఎయిర్‌లైన్ ఉద్యోగి అతను ఫ్లైట్ ఎక్కనివ్వలేదని ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపారు. ఆ కోపంతో అకస్మాత్తుగా సుత్తిని తీసుకుని కౌంటర్‌లోని కంప్యూటర్ స్క్రీన్‌లను ధ్వంసం చేశాడని.. అలాగే వస్తువులను కూడా పాడు చేసినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు వస్తువులను ధ్వంసం చేసినందుకు నిందితుడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నష్టపరిహారంగా భారీ జరిమానా విధించారు. అతడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
0 Comments