Ad Code

ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ మధ్య తేడా ?


దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలో చదవాలనే కల చాలా మందికి ఉంటుంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, ఈ విద్యాసంస్థల్లో సీటు పొందడం అంత సులభమేమీ కాదు. జేఈఈ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది. 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) : ఐఐటీలు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలలు. ఇక్కడ చదవాలని చాలామంది కలలు కంటారు. అయితే, జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే అడ్మిషన్ దక్కుతుంది. ఐఐటీ జేఈఈ దేశంలోఅత్యంత కఠినమైన ఎంట్రెన్స్ టెస్ట్ గా పేరొందింది. ఈ విద్యాసంస్థలు యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐఐటీలు ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. బీటెక్ ఫీజు సంవత్సరానికి రూ. 2.2 లక్షల నుండి రూ. 3.2 లక్షల మధ్య ఉంటుంది. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం అధనంగా రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇలా లెక్కేసుకుంటే నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు మొత్తం రూ. 10 లక్షల నుంచి రూ. 14 లక్షల ఖర్చవుతుంది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) : ఐఐటీల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా ఎన్ఐటీలకు పేరుంది. ఐఐటీల్లో సీటు దక్కనివారు ఎన్ఐటీలను ఎంపిక చేసుకుంటారు. ఈ విద్యాసంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. బీటెక్ కోర్సుల యాన్యువల్ ఫీజు రూ. 1.4 లక్షల నుండి రూ. 2.4 లక్షల వరకు ఉంటుంది. హాస్టల్, మెస్లకు సంవత్సరానికి రూ. 1.2 లక్షల నుంచి రూ. 2.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ విధంగా నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు మొత్తం రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఖర్చవుతుంది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) : ట్రిపుల్ ఐటీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో నిర్వహిస్తాయి. ఐఐటీ, ఎన్ఐటీల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా వీటికి పేరుంది. ట్రిపుల్ ఐటీలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ సంబంధిత రంగాల్లో కోర్సులను అందిస్తాయి. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది. అయితే, జేఈఈలో తక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ వీటిలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యాసంస్థలు యూజీ, పీజీ, డాక్టోరల్ ప్రోగ్సామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ట్రిపుల్ ఐటీలో యాన్యువల్ ఫీజు రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉంటుంది. మెస్, హాస్టల్ కోసం సంవత్సరానికి రూ. 1.2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల మధ్య చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా నాలుగేళ్లకు గానూ రూ. 8 లక్షల నుంచి రూ. 14 లక్షల వరకు ఖర్చవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu