చంద్రుడి ఆవిర్భావాన్ని తేల్చనున్నజపాన్ వ్యోమనౌక 'స్లిమ్' ?
జపాన్ వ్యోమనౌక 'స్లిమ్' చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తూ కీలకమైన సమాచారాన్నిపంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు. వాటి సాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన వివరాలను పొందొచ్చని జపాన్ అంతరిక్ష సంస్థ తాజాగా తెలిపింది. స్లిమ్ వ్యోమనౌక 2024 జనవరి20న చంద్రుడిపై దిగింది. అది తలకిందులుగా ల్యాండ్ కావడంతో దాని సౌరఫలకాలు ముందుగా సూర్యుడి నుంచి కాంతిని పొందలేకపోయాయి. అయితే, 8వ రోజు నుంచి అది పనిచేయడం ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా ఈ వ్యోమనౌక తన మల్టీ బ్యాండ్ స్పెక్ట్రల్ కెమెరా సాయంతో జాబిల్లి శిలల్లోని మూలకాలను శోధించింది. ఒక రాతి ముక్కను అది విశ్లేషిస్తుందని అంతా భావించారు. కానీ, ఏకంగా 10 శిలలను అది శోధించింది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమైంది. చంద్రుడి శిలల్లోని మూలకాలను, భూమి మీదున్న శిలల్లోని మూలకాలను పోల్చి చూడటం ద్వారా కీలక విషయాలను తెలుసుకోవచ్చనీ రెండు చోట్లా ఒకే రకం మూలకాలు ఉన్నాయా అన్నది తేల్చవచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు.