విపక్షాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన
పార్లమెంట్ ఆవరణలో అధికార ఎన్డీయే ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. మకర్ ద్వార్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎంపీలు.. విపక్షాలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. సభను అడ్డుకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇదే ఆవరణలో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఇన్ని రోజులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం గమనార్హం. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదని ఆరోపించారు. ఎన్డీయే ఎంపీల నిరసనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళ్ మిలాన్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ పరిణామాలు, ప్రతిపక్షాల వ్యూహంపై చర్చించిన అనంతరం ఎంపీలు ర్యాలీ చేపట్టారు. విపక్షాల ఆందోళనలకు ప్రతిస్పందనగా అధికార పక్షం ఈసారి "రివర్స్ స్ట్రాటజీ" అమలు చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.