అంతరిక్షం నుంచి భారతదేశానికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు పంపిన రష్యా కాస్మోనాట్లు
అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ లో ఉన్న రష్యా కాస్మోనాట్లు భారతదేశానికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపారు. వీడియో సందేశంలో వారు భారత జాతీయ పతాకం తిరంగాను చేతిలో పట్టుకుని, భారత్-రష్యా మధ్య చిరకాల స్నేహాన్ని ప్రస్తావిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందేశాన్ని డీడీ న్యూస్ అధికారిక ఖాతా ద్వారా పంచుకుంది. కాస్మోనాట్ ప్యోటర్ డుబ్రోవ్ సందేశాన్ని ప్రారంభిస్తూ, "ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు భారత దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది" అని తెలిపారు. భారత ప్రజలు వలస పాల సంకెళ్లను తెంచుకొని.. శాంతి, సమృద్ధిని కోరుకుంటూ.. స్వావలంబన సాధిస్తూ అభివృద్ధి మార్గంలో పయనించారని ఆయన గుర్తుచేశారు. సందేశంలో కాస్మోనాట్ అన్నా కికినా కూడా పాల్గొన్నారు. అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అందంగా కనిపిస్తుందనీ, కానీ భూమి మీద మరింత అందంగా ఉందని ఆమె అన్నారు. భారత్-రష్యా సహకారం గగన్‌యాన్ మానవ అంతరిక్ష కార్యక్రమం ద్వారా మరింత విస్తరిస్తోందని ఆమె ప్రస్తావించారు. చివరగా కాస్మోనాట్ ఆండ్రీ ఫెడ్యాయె..వ్ తిరంగాను ఎత్తి పట్టుకుని "భారత్-రష్యా స్నేహం చిరకాలం నిలుస్తుంది" అని ప్రకటించారు.