మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు ఊహించని మార్పులకు సిద్ధమవుతోంది. సుదూర అటవీ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొనడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రోడ్లు, మొబైల్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, పర్యాటక రంగానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం కర్రెగుట్టలో పర్యటించి, అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి, పర్యాటక కేంద్రంగా మారుతున్న తీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతికి ప్రతీకగా తెల్లని పావురాలను గాల్లోకి వదిలారు. పామూరు నుంచి చలమడ వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తికాగా, త్వరలోనే బ్లాక్‌టాపింగ్ పనులు చేపట్టనున్నారు. దీనితో పాటు ఈ ప్రాంతంలో విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనెక్టివిటీ మెరుగైతే ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతుందని, పర్యావరణ మరియు చట్టపరమైన నిబంధనలకు లోబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీస్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్లు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సమన్వయ ఆపరేషన్ల వల్లే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిందని డీజీపీ ఆనంద్ తెలిపారు. 'ఆపరేషన్ కగర్' సమయంలో సుమారు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని, పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో హతమవగా మరికొందరు జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం, భూ కేటాయింపులు, జీవనోపాధి కల్పన వంటి పునరావాస చర్యలను ప్రభుత్వం అమలు చేస్తోందని వెల్లడించారు. పర్యటనలో భాగంగా పామురు క్యాంపు సమీపంలో నివసిస్తున్న గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి, ప్రభుత్వ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం ములుగులోని 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లో పర్యటించిన డీజీపీ ఆనంద్.. వర్ధమాన భద్రత, శాంతిభద్రతల సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువతలో సైబర్ నేరాలు, డ్రగ్స్ వాడకం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై అవగాహన కల్పించాలని కోరారు. బెటాలియన్ సిబ్బంది సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
0 Comments