విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢసారె కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆషాఢమాసం నెలరోజులూ దుర్గాదేవికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సారె పేరుతో రకరకాల కానుకలు అర్పించారు. దుర్గమ్మకు సారెను ఇవ్వడం వల్ల సౌమాంగళ్యం సిద్ధిస్తుందని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లాపాపలతో సహా తరలివచ్చి భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గత నెల ఆరోతేదీ నుంచి ప్రారంభమైన ఈ పవిత్రసారె కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. తొలిరోజు ఆలయ సంప్రదాయం ప్రకారం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాఢ పవిత్రసారెను సమర్పించగా.. చివరి రోజున ఆలయ ఈవో రామారావు, ఆలయ సిబ్బంది, పండితులు, ఇతర విభాగాల యంత్రాంగం కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. ఆషాఢ సారె కార్యక్రమం దుర్గా నవరాత్రుల తర్వాత అంత పెద్ద ఉత్సవంగా మారింది. సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఈ సారె సమర్పణలో పాల్గొన్నారు.
0 Comments