విదేశాలకు ఎగుమతి అయ్యే ఇంధనంపై పన్ను పెంపు
కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దులు దాటి విదేశాలకు ఎగుమతి అయ్యే ఇంధనాలపై పన్నుల భారాన్ని గణనీయంగా పెంచింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంలేదా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సమీక్షిస్తూ పెంపు నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. పెట్రోల్ ఎగుమతిపై పన్నును లీటరుకు 2.5 రూపాయిల నుంచి 3.5 రూపాయిలకు పెంచగా, డీజిల్ ఎగుమతి పన్నును లీటరుకు 15.5 రూపాయిల నుంచి ఏకంగా 25.5 రూపాయిలకు పెంచింది. అదేవిధంగా ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై కూడా లీటరుకు పన్నును 14.5 రూపాయిల నుంచి 22 రూపాయిలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక లాభాల కోసం ఇంధనాన్ని ఎగుమతి చేయడాన్ని నిరుత్సాహపరచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచడం ద్వారా, ఆయా కంపెనీలు సరుకును విదేశాలకు పంపడం తగ్గించి దేశీయంగానే విక్రయించేలా ఒత్తిడి తెచ్చినట్లవుతుంది. దీనివల్ల మన దేశంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉండటంతో పాటు, దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉండేందుకు ఈ వ్యూహాత్మక పన్ను పెంపు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.