అంతర్ జిల్లా బైక్ దొంగలు అరెస్ట్ : ఏడు ద్విచక్ర వాహనాల స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం తూముకుంట గ్రామానికి చెందిన మావిళ్ళ వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు (45), కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు (40) అనే ఇద్దరు దొంగలు అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాలలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించామని రాయచోటి డిఎస్పి కృష్ణమోహన్ తెలిపారు. ఈ ఇద్దరు నిందితుల పై ఇదివరకే అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాలలోని 31 ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మావిళ్ళ వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు ఓ చోరీ కేసులో అరెస్టై జైలు కు వెళ్లి 6 నెలల క్రితమే బెయిల్ పై విడుదలై అదే గ్రామానికి చెందిన కోటకొండ ఆంజనేయులు అలియాస్ గుండు తో కలిసి మరోమారు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతూ వచ్చారని డిఎస్పి కృష్ణమోహన్ రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.