స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఈ జాతీయ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఇద్దరూ హాజరుకాకపోవడం వరుసగా ఇది రెండో ఏడాది కావడం గమనార్హం. అధికారిక ప్రొటోకాల్ ప్రకారం టేబుల్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఆధారంగా రాహుల్ గాంధీకి సీటింగ్ కేటాయిస్తామని రక్షణ శాఖ స్పష్టం చేసినప్పటికీ, ఆయన ఈ వేడుకలకు హాజరుకాలేదు. రాష్ట్రపతి సచివాలయం జారీ చేసిన వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్ ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా కేంద్ర కేబినెట్ మంత్రి హోదాతో సమానంగా ఉంటుంది. అయితే, 2024 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీకి ఐదో వరుసలో సీటు కేటాయించడంపై చెలరేగిన వివాదమే ఈ గైర్హాజరుకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024లో కేబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నేతను ఐదో వరుసలో కూర్చోబెట్టడం ద్వారా ప్రభుత్వం ఎల్‌ఓపీ హోదాను అవమానించిందని, అధికార పక్షం చిన్నచూపు చూసిందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. అయితే ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆ విధంగా సీట్లు కేటాయించాల్సి వచ్చిందని రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, 2025లోనూ ఇప్పుడూ ఖర్గే, రాహుల్ గాంధీ ఎర్రకోట వేడుకలకు హాజరుకాలేదు. అంతేకాకుండా ఈ ఏడాది జనవరిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ తమను మూడో వరుసలో కూర్చోబెట్టడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర మరియు అధికారిక వేడుకల్లో సీటింగ్ ఏర్పాట్లు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన హోదాలు, 'టేబుల్ ఆఫ్ ప్రిసిడెన్స్' నిబంధనల ప్రకారమే జరుగుతాయని, రాజకీయ అనుబంధాల ఆధారంగా కాదని రక్షణ శాఖ స్పష్టం చేస్తూ వస్తోంది. జాతీయ వేడుకల్లో తమ నేతల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉండటం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.