బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రజల్లో కానరాని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14వ తేదీ జరుపుకుంది. అయితే, ఈ వేడుకలను బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రజలు బహిష్కరించి తమ గృహాలకే పరిమితమయ్యారు. ప్రధానంగా బలూచిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో నిర్మానుష్య, బంద్ వాతావరణం కనిపించింది. క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లోని వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, రోడ్లపై జనసంచారం చాలా తక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక శిబిరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించి, కదలికలను నిశితంగా పర్యవేక్షించారు. ప్రభుత్వం, సైన్యం ఆధ్వర్యంలో కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే నామమాత్రంగా వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. క్వెట్టాలోని జర్జూన్ కాలనీలో కౌంటర్-టెర్రరిజం డిపార్టుమెంట్ (సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ) సిబ్బంది పాల్గొన్న స్వాతంత్ర్య వేడుకలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్లు, గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు ఎనిమిది పేలుళ్లు సంభవించినట్లు 'ది బలూచిస్థాన్ పోస్ట్' తన కథనంలో పేర్కొంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org