నీట్‌పై నిష్పక్షపాతంగా చర్చ జరగాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి !

నీట్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. బుధవారం రాజ్యసభ సమావేశాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 'నీట్ అంశంపై నిష్పక్షపాతంగా చర్చ జరగాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేసేంతవరకు ఎలాంటి చర్చా ఉండదు' అని అన్నారు. దీనిపై లీడర్ ఆఫ్ ది హౌస్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. 'ప్రభుత్వం చర్చకు వెనకడుగు వేయడం లేదు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన అన్ని విషయాలపై కూడా చర్చించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాది పారదర్శకమైన ప్రభుత్వం' అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ, ప్రతిపక్షాలు నిరసనలతో సభను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. 'మీరు సభ జరగకుండా అడ్డుకోవాలన్న ఆలోచనతో ఉంటే.. అది కచ్చితంగా మంచి పద్ధతి కాదు' అని అన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org