ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా దారి తప్పిందని, దీనివల్ల సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనిమండిపడ్డారు. గడిచిన పదేళ్ల కాలంలో సుమారు 152 ప్రశ్నాపత్రాల లీకేజీ సంఘటనలు చోటుచేసుకున్నాయని, వీటి కారణంగా దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా దెబ్బతిన్నారని తెలిపారు. ఇన్ని తీవ్రమైన ఘటనలు జరుగుతున్నప్పటికీ బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లతో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతును నొక్కేందుకు కేంద్రం బలప్రయోగానికి పూనుకుంటోందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యాన్ని ఎండగడుతూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ముందు రాహుల్ గాంధీ మూడు ముఖ్యమైన డిమాండ్లను ఉంచారు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యతల నుంచి తక్షణమే తొలగించాలి. నీట్ అక్రమాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ ఘోర తప్పులపై ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని, వారి తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పులు చేసి చదివిస్తున్నా.. చివరికి పేపర్ లీకేజీల వల్ల వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపరీతమైన పరిస్థితుల వల్ల కష్టపడే సాధారణ కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతుండగా, అక్రమ మార్గాలను ఆశ్రయించే వారికే ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు.
0 Comments