జూన్ నెలలో ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, రవాణా ఖర్చులు, బంగారం-వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ ఊపందుకుంది. ఇదే సమయంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగానికి పైగా ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని మించిపోయింది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తెలంగాణలో అత్యధికంగా 6.36 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చెరో 5.39 శాతం నమోదైంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. తెలంగాణ - 6.36 శాతం, ఆంధ్రప్రదేశ్ - 5.39 శాతం, పుదుచ్చేరి - 5.39 శాతం, తమిళనాడు - 5.24 శాతం, ఒడిశా - 5.15 శాతం, మధ్యప్రదేశ్ - 5.09 శాతం, అండమాన్ నికోబార్ - 5.08 శాతం నమోదైంది. అలాగే కర్ణాటక (4.8 శాతం), రాజస్థాన్ (4.7 శాతం), ఉత్తరప్రదేశ్ (4.56 శాతం), కేరళ (4.34 శాతం), జార్ఖండ్ (4.29 శాతం), ఉత్తరాఖండ్ (4.13 శాతం), గుజరాత్ (4.01 శాతం) రాష్ట్రాల్లో ఆర్బీఐ లక్ష్యాన్ని మించి ద్రవ్యోల్బణం నమోదైంది. దేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణం మిజోరంలో నమోదైంది. అక్కడ 1.63 శాతం మాత్రమే నమోదైంది. తర్వాతి స్థానాల్లో త్రిపుర - 1.65 శాతం, అరుణాచల్ ప్రదేశ్ - 2.47 శాతం, మేఘాలయ - 2.64 శాతం, నాగాలాండ్ - 2.83 శాతం, మణిపూర్ - 2.94 శాతం, ఢిల్లీ - 2.96 శాతం ఉన్నాయి. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో 3.93 శాతం ఉండగా.. జూన్‌లో 4.38 శాతానికి పెరిగింది. ఇది గత ఆరు నెలల్లో నమోదైన అత్యధిక స్థాయిగా నమోదైంది. నెలవారీగా చూస్తే వినియోగదారుల ధరలు 1.03 శాతం పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యధిక నెలవారీ పెరుగుదలగా నమోదైంది. జూన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతానికి చేరుకుంది. మేలో ఇది 4.78 శాతంగా ఉంది.