బలవన్మరణానికి పాల్పడిన షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ కథ విషాదాంతమైంది. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ఉన్మాది చివరకు తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పంజర్లలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రగిలిపోయిన రాజ్‌కుమార్ ఈనెల 10న అర్ధరాత్రి మూడు వేర్వేరు ప్రాంతాల్లో అత్యంత దారుణంగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మొదట షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మలను నరికి చంపాడు. ఆపై ఆ బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు కొడుకులను సైతం కిరాతకంగా బలిగొన్నాడు. ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఉదంతాన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో 12 ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడమే కాక రూ.2 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఆరుగురిని చంపిన తర్వాత 'నేను కూడా చనిపోతున్నా' అని రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసినట్లు సమాచారం. మొదట తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించి తప్పించుకున్నాడు. కానీ చివరకు పంజర్లలో శవమై తేలాడు.దీంతో కేసు కీలక మలుపు తిరిగింది.