పీఎఫ్ ట్రస్టులకు అమ్నెస్టీ స్కీమ్ 2026 మార్గదర్శకాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తాజాగా 'అమ్నెస్టీ స్కీమ్ 2026' పథకాన్ని ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం 1961 కింద గుర్తింపు పొంది, మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నిర్వహిస్తున్న సంస్థలకు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. యాజమాన్యాలు మరియు సంబంధిత వాటాదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం సూచించింది. తాజా చట్టపరమైన మార్పుల ప్రకారం ఫైనాన్స్ యాక్ట్ 2026, ఆదాయపు పన్ను ఫ్రేమ్‌వర్క్‌ను ఉద్యోగుల భవిష్య నిధి చట్టం, 1952లోని చట్టపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలతో లింక్ చేసింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వివరించిన వివరాల ప్రకారం ఇకపై ఆదాయపు పన్ను చట్టం 2025 కింద పీఎఫ్ ట్రస్టులకు గుర్తింపు దక్కాలంటే, అవి తప్పనిసరిగా ఈపీఎఫ్ చట్టం, 1952లోని సెక్షన్ 17 కింద మినహాయింపు పొంది ఉండాలి. ఈ అమ్నెస్టీ స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ చట్టంలోని సెక్షన్ 17, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020 లోని సెక్షన్ 143 కింద సంస్థలకు పాత తేదీల నుంచి క్రమబద్ధీకరణ మంజూరవుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద పీఎఫ్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నప్పటికీ, సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారిక మినహాయింపు నోటిఫికేషన్ లేని సంస్థలు దీనికి అర్హులు. పీఐబీ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ అమ్నెస్టీ పథకం కేవలం నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జూన్ 29న అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ఆరు నెలల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కలిగిన సంస్థలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ-I లో మినహాయింపు లేని సంస్థలుగా ఇప్పటికే నిబంధనలు పాటిస్తున్నవి లేదా భవిష్యత్తులో అలా కొనసాగాలనుకుంటూనే గత కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవాలనుకునే సంస్థలు. కేటగిరీ-IIలో కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ, 2020 నిబంధనల ప్రకారం మినహాయింపు పొందిన సంస్థలుగా కొనసాగుతూనే.. పాత కార్యకలాపాలను రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునే ట్రస్టులు. ఈ స్కీమ్ ద్వారా యాజమాన్యాలకు భారీ ఊరట లభించనుంది. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి నిర్దేశిత కటాఫ్ తేదీ వరకు మినహాయింపు హోదా, ట్రస్ట్ గుర్తింపు లభిస్తుంది. అలాగే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం ఉండాల్సిన కనీస ఉద్యోగుల సంఖ్య, కనీస కార్పస్ సైజు నిబంధనలను యాజమాన్యాలకు మాఫీ చేశారు. ట్రస్ట్ సభ్యుల ఖాతాలకు చట్టబద్ధమైన వడ్డీ రేట్లకు సమానంగా లేదా అంతకంటే మెరుగైన వడ్డీ, విరాళాలు అందించి ఉంటే.. ఆ ట్రస్టులపై పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు, పెనాల్టీల అసెస్‌మెంట్‌లు ఉపసంహరిస్తారు. పాత ఆర్డర్‌లు సైతం రద్దు అవుతాయి. సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను జూన్ 29న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ GSR 525(E) స్పష్టంగా తెలిపింది. అర్హులైన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అధికారిక దరఖాస్తును సమర్పించాలి. ఆసక్తి ఉన్న సంస్థలు rc.exemption@epfindia.gov.in కు ఈమెయిల్ చేయవచ్చు లేదా తమ సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి దరఖాస్తులు పంపవచ్చు. అలాగే, ఆర్థిక ఖాతాలను తప్పనిసరిగా ఛార్టర్డ్ అకౌంటెంట్ చేత ఆడిట్ చేయించాలి. ఈపీఎఫ్ అధికారులు ఆదేశించే ప్రత్యేక లేదా కంప్లయన్స్ ఆడిట్‌లను దరఖాస్తు చేసిన 3 నెలల్లోగా పూర్తి చేయాలి. పూర్తి వివరాలు, సర్క్యులర్లు, ప్రామాణిక నిర్వహణ విధానాల కోసం ఈపీఎఫ్ఓ )అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలు ఈ ప్రక్రియలో సంస్థలకు తగిన మార్గదర్శకత్వం అందిస్తాయి.