తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారినిదర్శించుకున్నారు. కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికాతో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబానీ కుటుంబం తిరుమలకు చేరుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం చెప్పి, శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం అంబానీ కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదిస్తూ వేద మంత్రోచ్చారణల మధ్య అంబానీ కుటుంబానికి ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.