ప్రధాని మోడీని ఉద్దేశించి ఖర్గే చేసిన 'ఉగ్రవాది' వ్యాఖ్యలు : కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన 'ఉగ్రవాది' వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రధానిని ఉగ్రవాది అనడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇది కేవలం మోదీని మాత్రమే కాకుండా, ఆయనను ఎన్నుకున్న కోట్లాది మంది ప్రజలను మరియు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ఎన్నికల్లో ఓటమి భయంతో, తీవ్ర నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై ఉన్న ద్వేషంతోనే ఇటువంటి అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఖర్గే వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఖర్గేతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి సాహసం చేయకుండా ఈసీ గుణపాఠం నేర్పేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బృందంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్‌వాల్, బీజేపీ నేత అరుణ్ సింగ్ కూడా ఉన్నారు.