Ad Code

కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో రేపు చర్చ


కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో రేపు చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశం పైన సీఎం చంద్రబాబు వద్ద కీలక సమావేశం జరిగింది. సభలో అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటుగా..టీటీడీ లో మార్పుల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యమతస్థుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నారు. కల్తీ నెయ్యి అంశం ఇప్పటి వరకు రాజకీయ దుమారానికి కారణమైంది. ఇప్పుడు ఈ అంశం పైన అసెంబ్లీ వేదికగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఇందు కోసం ముహూర్తంగా ఖరారు చేసింది. అసెంబ్లీలో ఇందు కోసం నాలుగు గంటల సమయం కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వద్ద ఈ అంశం పైన ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో ఆవర్ రద్దు చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు నెయ్యి కల్తీ పై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి నెయ్యి కల్తీ పై టీడీపీ, జన సేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల లతో మాట్లాడించాలని నిర్ణయించారు. అయితే, స్వల్ప అస్వస్థత కారణంగా ఈ రోజు సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. రేపు సభకు వచ్చిన తరువాత కల్తీ నెయ్యి పై డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంశం పైన ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి కల్తీ నెయ్యి పై సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఇదే సమావేశంలో టీటీడీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలనే అంశం పైన జరిగిన చర్చకు ఆమోదం తెలిపారు. అదే విధంగా టీటీడీ నిబంధనలు ప్రకారం అన్యమత స్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉండటంతో ఇకనుంచి ఆ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. అమృతసర్ లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానం కు కూడా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అమృతసర్ లో స్వర్ణ దేవాలయం కు ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. అటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కు కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఈ మేరకు స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే, రేపు జరిగే చర్చకు వైసీపీ హాజరవుతుందా లేదా.. ఈ చర్చ తరువాత చంద్రబాబు చేసే ప్రకటనలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Post a Comment

0 Comments

Close Menu