నవంబర్‌లో రూ.1.82 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు !
దేశంలో వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. నవంబర్ మాసంలో రూ.1.82లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.34,141 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.91,828 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.13,253కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దేశీయ లావాదేవీలతో అధిక మొత్తంలో రెవెన్యూ సమకూరినట్లు పేర్కొంది. గతేడాది నవంబర్‌తో (రూ.1.68 లక్షల కోట్లు) పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.5శాతం పెరగడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఏడోసారి. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు 9శాతం వార్షిక వృద్ధితో రెండో అత్యుత్తమ వసూళ్లు కాగా.. 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి.