షావోమీ ఇండియా సారథ్య బాధ్యతల నుంచి వైదొలగిన మురళీకృష్ణన్
షావోమి ఇండియా విభాగ సారథ్య బాధ్యతల నుంచి మురళీకృష్ణన్ వైదొలగారు. ఈ విషయాన్ని షావోమీ మంగళవారం ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది చివరి వరకు ఆయన సంస్థలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మురళీకృష్ణన్ 2018లో షావోమీలో చేరి అంచలంచెలుగా ఎదిగి 2022 నాటికి ఇండియా విభాగ సారథిగా భాద్యతలు స్వీకరించారు. కంపెనీని అభివృద్ధి పథంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మోటారోలా, లెనోవా మాజీ మేనేజర్ డైరెక్టర్ సుధిన్ మథుర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా షావోమీ నియమించింది. ఈ నియామకం జరిగిన కొన్ని రోజులకే మురళీకృష్ణన్ రాజీనామా చేయడం గమనార్హం. ''షావోమీ ఇండియాలో నా అనుభవం అత్యంత ముఖ్యమైనది. నా ప్రయాణంలో సాధించిన విజయాల పట్ల చాలా గర్వంగా ఉంది. షావోమీలో బాధ్యతలు నిర్వహించే సమయంలో నాకు సహకరించిన టీమ్ సభ్యులకు, భాగస్వాములకు కృతజ్ఞతలు'' అని మురళీకృష్ణన్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసేందుకు బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.