తెలంగాణలోని హనుమకొండలో బడి నుంచి వచ్చిన బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపి సీఐ (వేకెన్సీ రిజర్వ్-వీఆర్) బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు, ఉన్నతాధికారులు సదరు సీఐను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు నిందితుడిపై కాజీపేట పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ హనుమకొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉండే ప్రాంతానికి చెందిన ఓ బాలికపై కన్నేశాడు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చిన సదరు బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపి ఇంట్లోకి పిలుచుకున్నట్లు, స్కూల్ విషయాలు అడుగుతూ ఆమె శరీరాన్ని అభ్యంతకర రీతిలో తాకుతూ ప్రవర్తించినట్లు సమాచారం. అప్పటికే ఆ బాలిక తాను ఇంటి వెళ్లాలి అంకుల్ అంటూ విడిపించుకునేందుకు ప్రయత్నించినా విచక్షణ మరిచిన ఆ పోలీసు ఆ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి ఆ బాలిక ఎలాగోలా తప్పించుకుని ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిందితుడు పోలీస్ అధికారి కావటంతో వారు ఫిర్యాదు చేసేందుకు కొంత వెనుకడుగు వేశారు. ఎట్టకేలకు మిత్రుల సలహాతో ఆ తల్లిదండ్రులు మంగళవారం కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అక్కడ సీఐ రవికుమార్‌పై పోక్సో చట్టం 2012 కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు (సీఆర్ నెం.264/2024) కేసు నమోదైనప్పటికి బయటకు పొక్కకుండా స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఎస్‌హెచ్‌వోను సమాచారం అడగ్గా మూడు రోజులుగా అనారోగ్యం వల్ల డ్యూటీలో లేనని చెప్పాడని, అతడితో పాటు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ, మరో ఎస్‌ఐ కూడా ఫోన్లు ఎత్తకుండా సమాచారాన్ని దాటవేసే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై అధికారుల నుంచి కూడా ఇదే స్పందన వ్యక్తమైంది. ఎట్టకేలకు ఎఫ్‌ఆర్‌ఐ కాఫీ బయటకు లీక్ కావటంతో సీఐ బాగోతం వెలుగులోకి వచ్చిందనే చర్చ జరుగుతోంది. సీఐ రవికుమార్ గతంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించారు. మడికొండ పోలీ్‌సస్టేషన్‌లో సీఐగా పని చేస్తున్న క్రమంలో ఎంఆర్‌పీఎస్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను మడికొండ వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. అయితే పైఅధికారులకు సమాచారం లేకుండా వీరిలో కొందరిని ఇంటికి పంపించటంపై అప్పట్లో ఉన్నతాధికారుల తీవ్రంగా పరిగణించడంతో బదిలీ వేటు పడింది. అలాగే మామునూరు సీఐగా పనిచేస్తున్న సమయంలో బ్యూటీఫార్లర్ నిర్వహించే ఓ మహిళను రవికుమార్ వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా రవికుమార్‌ను ఐజీకి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ రవికుమార్‌పై తాజాగా మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి సంబంధించి కేసు నమోదవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
0 Comments